- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా టిమ్స్ అభివృద్ధి
- రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి.. జనవరిలో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల ఏర్పాట్లను ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి శ్రీగణేశ్, ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి దాదాపు మూడు గంటలపాటు హాస్పిటల్‌లోని అన్ని బ్లాక్‌లు, వైద్య విభాగాలను కలియతిరిగారు.
అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, వైద్యాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సివిల్, ఎలక్ట్రికల్ తదితర పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అల్వాల్ టిమ్స్ నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం 95 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జనవరి నాటికి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ ఆస్పత్రిలో మొత్తం 1,000 బెడ్లు, 21 మేజర్, 7 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయని వెల్లడించారు.
అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన డయాగ్నస్టిక్ సదుపాయాలతో రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పారు. అల్వాల్ టిమ్స్‌ను న్యూరో సైన్సెస్, జెనెటిక్ సైన్సెస్ విభాగాల్లో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాలతోపాటు వివిధ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
